వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోన్న పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ శాసనసభ, లోక్‌సభ స్థానాల నుంచి ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనే అంశంపై భారీ కసరత్తు చేస్తోంది. దీని కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన జనసేన, పోటీచేయాలనుకునే ఆశావాహులు పూర్తి వివరాలతో కూడిన తమ బయోడేటాను పంపించాలని సూచించారు. దరఖాస్తుదారుల్లో పోటీకి అర్హులైన వారిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన తరఫున సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆదివారం ఒక్కరోజే 45 మంది మహిళలు సహా 210 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీని కలిసి తమ బయోడేటాను అందజేశారు.
తమలో ఒకరికి టికెట్ కేటాయించాలంటూ 8 మంది దంపతులు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. వివిధ రంగాలకు చెందిన వారితోపాటు వృత్తి నిపుణులు, ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు స్క్రీనింగ్ కమిటీ ముందుకు 200 దరఖాస్తులు, శుక్రవారం 350 దరఖాస్తుల వరకు వచ్చినట్టు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై స్క్రీనింగ్ కమిటీకి పలు సూచనలు చేసింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చిన పవన్, నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment